తెలంగాణలో స్కూల్స్ కాలేజీల రీఓపెన్ పై కేసీఆర్ కీలక నిర్ణయం
- తొలుత 9, 10 తరగతులు.తర్వాత 6 నుండి 8 తరగతులు
- జూనియర్ కాలేజీలు జనవరి 4న ప్రారంభం
- మూడు నెలలపాటు తరగతులు తర్వాత పరీక్షలు
- ఏప్రిల్,మే నెలలో వార్షిక పరీక్షల నిర్వహణ
- ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన పంపినట్లు విద్యా శాఖామంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి
TS Schools and Colleges Reopen 2021: తెలంగాణ రాష్ట్రంలో పదవ తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షలు నిర్వహించే ముందు పాఠశాలలను కనీసం మూడునెలలపాటు తెరువాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ భావిస్తున్నది. ప్రభుత్వం అనుమతిస్తే జనవరి నాలుగో తేదీ నుంచే పాఠశాలలు, జూనియర్ కాలేజీలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నది. తొలుత 9, 10 తరగతులు, జూనియర్ కాలేజీలలో రెగ్యులర్ క్లాసులు నిర్వహించేందుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఆ తరువాత దశల వారీగా 6 నుంచి 8, ఆ తర్వాత 1నుండి 5 వరకు ప్రాథమిక తరగతులను రెగ్యులర్‌గా నిర్వహించాలని భావిస్తున్నది. తమ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు పంపించామని విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం వెల్లడించారు.
ఆన్‌లైన్ క్లాసుల పట్ల విద్యార్థులకు ఆసక్తి సన్నగిల్లుతున్నట్టు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు. ప్రభుత్వ స్కూల్ టీచర్ల సంఘాల నాయకులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు బడులు తెరవాలని కోరుతూ వినతిపత్రాలు ఇచ్చారన్నారు. ఈ నేపథ్యంలో జనవరిలో పాఠశాలలను, కళాశాలలను తెరువనున్నట్టు విద్యా శాఖా మంత్రి వివరించారు.
పరీక్షలు ఏప్రిల్, మే నెలలో నిర్వాహణ :
కొవిడ్-19 నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులకు పరీక్ష పేపర్లను తగ్గించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది. 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్లతో ముగించాలని భావిస్తున్నామని, పరీక్ష సమయంలో మార్పు ఉండదని అధికారులు తెలిపారు. పదో తరగతి పరీక్షలను ఈ సారి మార్చికి బదులుగా మే నెలలో నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ రెండో వారంలో నిర్వహించనున్నారు. అంతకుముందుగానే ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తారు. జనవరి మొదటివారం నుంచి జూనియర్ కాలేజీలు ప్రారంభమైతే.. రెగ్యులర్ పాఠాలతో పాటు ప్రాక్టికల్స్‌ను కూడా బోధిస్తారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు కూడా సీఎం కార్యాలయానికి పంపారు.
జనవరిలో టీఎస్ టెట్ నోటిఫికేషన్ :
విద్యాశాఖలో ఉపాధ్యాయ నియామకాల కంటే ముందుగానే టీచర్ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. అందుకు సంబంధించిన ప్రక్రియ మొదలైందని, వీలైనంత త్వరలోనే షెడ్యూల్ జారీ చేసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. దీనివల్ల దాదాపు నాలుగు లక్షల మంది ఉపాధ్యాయ కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలకు సంబంధించిన కసరత్తు నడుస్తున్నదని తెలిపారు.
నిర్వహణకు ప్రతిపాదనలు:
- మొదట 9, 10 తరగతుల వారికి రెగ్యులర్ క్లాసులు
- ప్రతి గదిలో 15 నుంచి 20 మంది కూర్చునే వీలు
- కొవిడ్ నిబంధనలపై విద్యార్థులకు అవగాహన, జాగ్రత్తలపై అవగాహన
- చలి తీవ్రతను బట్టి ఇతర తరగతుల నిర్వహణ
- ఇంటర్ తరగతులు జనవరిలో ప్రారంభం.
Post a Comment