నిరుద్యోగులకు శుభవార్త...... తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖలు, సంస్థలో మొత్తం ఖాళీలు 65 వేలు.....!
Telangana Govt Jobs Upcoming Notifications: విభాగాల వారీగా ఖాళీల వివరాలు సైతం ఆయా శాఖలు ప్రభుత్వానికి సమర్పించాయి.
ప్రధానాంశాలు:- ప్రభుత్వ శాఖల్లో 45 వేలు, సంస్థల్లో 20 వేలు
- ప్రభుత్వానికి నివేదించిన ప్రధాన కార్యదర్శులు
- వైద్య, విద్య, పోలీస్‌శాఖలకు తొలి ప్రాధాన్యం
తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల చిరకాల స్వప్నం సాకారమయ్యే రోజులు త్వరలోనే రానున్నాయి. నిరుద్యోగ యువత ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న జాబ్ నోటిఫికేషన్స్ ఒకదాని తర్వాత ఒకటి కొత్త ఏడాది ప్రారంభంలోనే విడుదలయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వివిధ శాఖల, సంస్థల వారీగా ఖాళీల వివరాలు సైతం ప్రభుత్వానికి సమర్పించాయి. ఇప్పటివరకు ఉద్యోగాల ఖాళీలకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఇప్పటికే పలు శాఖలు, సంస్థల్లో ఉద్యోగ ఖాళీల వివరాలపై స్పష్టత వచ్చింది.వాటిలో సుమారు 65 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
రాష్ట్రంలో మొత్తం ఖాళీల వివరాలు:
వివిధ శాఖల్లో సుమారు 45 వేలు.సంస్థల్లో 20 వేలు భర్తీ చేయాల్సి ఉందని ముఖ్యకార్యదర్శులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఇందులో నాలుగో తరగతి ఉద్యోగుల వివరాలు కూడా ఉన్నట్టు తెలిపారు. ఒప్పంద, పొరుగు సేవల ఉద్యోగుల వివరాలు విడిగా పొందుపరిచారు. ఆ ప్రకారం పోలీసు, విద్య, వైద్యఆరోగ్య శాఖలలో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. పోలీసుల ఉద్యోగాలు 19 వేల వరకు ఉన్నట్లు సమాచారం.అదే విధంగా విద్యా శాఖలో 16 వేల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.కానీ వివరాలు సరిగా ఇవ్వలేదని తెలుస్తోంది.వారు ఇచ్చిన వివరాల ప్రకారం ఈ కింది విధంగా ఉన్నాయి.
విద్యా శాఖలో ఖాళీల వివరాలు :
పాఠశాల విద్యాశాఖలో 9,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు (ఎస్‌జీటీ) 5,800, స్కూలు అసిస్టెంట్లు 2,500, భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు(పీఈటీలు) 300, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల పోస్టులు 1000 వరకు ఉన్నాయి. ఇవిగాక ఉన్నతవిద్య, విశ్వవిద్యాలయాలు, సాంకేతిక విద్యాశాఖల పోస్టులు మరో మూడు వేల వరకు ఉన్నట్లు తేలింది. శాఖల వారిగా వచ్చిన వివరాలను ఆర్థిక శాఖ సేకరిస్తోంది. మొత్తం పోస్టుల్లో నాలుగో తరగతివి మినహాయించి, మిగిలినవి ఖాళీగా చూపనున్నారు. ఒకటి, రెండు రోజుల్లో ఖచ్చితమైన సంఖ్యపై స్పష్టత వచ్చే అవకాశముంది.
సీఎంకు పంపిన నివేదిక :
జిల్లాల నుంచి వచ్చిన వివరాలను ఆయా శాఖల అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు అందించారు. ఆ వివరాలను క్రోడీకరించి, ఖాళీల జాబితా, ఆయా స్థానాల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల జాబితాను అతి త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నివేదిక అందించినట్లు తెలుస్తుంది. ఆ నివేదికను సీఎం పరిశీలించిన తరువాత ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. భారీ స్థాయిలో వైద్య, విద్య, పోలీస్ శాఖల్లో నియామకాలు చేపట్టేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సర్కారు ప్రాథమికంగా నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఇక త్వరలో నోటిఫికేషన్స్ విడుదల అయ్యే అవకాశం ఉంది. ముందుగా టెట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు.ఆ తర్వాత వివిధ ఉద్యోగ నోటిఫికేషన్స్ వెంటవెంటనే వెలువడే అవకాశం ఉంది.
Post a Comment