- మే 9న నోటిఫికేషన్ విడుదల
- జూన్ 20 తర్వాత హాల్ టికెట్లు
- జూన్ 30న ప్రవేశ పరీక్ష
- సందేహాల నివృత్తికి హెల్ప్ లైన్ ఏర్పాటు
TS Polycet 2022: తెలంగాణ రాష్ట్రంలో బాసరలోని రాజీవ్‌గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ అండ్ టెక్నాలజీస్ (ఆర్జీయూకేటీ)లో సీట్లను గత ఏడాది తరహాలోనే ఈ ఏడాది కూడా పాలిసెట్ ద్వారానే భర్తీచేయనున్నారు. పాలిసెట్ ర్యాంక్‌ల ఆధారంగానే సీట్లను భర్తీ చేయాలని అధికారులు నిర్ణయించారు.
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులు సాధించిన ఎస్సెస్సీ మార్కుల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తుండగా, గత ఏడాది ఎస్సెస్సీ పరీక్షలు జరగకపోవడంతో పాలిసెట్ ర్యాంక్‌ల ద్వారా సీట్లను భర్తీచేశారు. అదే విధంగా ఈ సంవత్సరం కూడా భర్తీ చేస్తున్నారు.
పాలిటెక్నిక్ కాలేజీలతో పాటు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని అగ్రికల్చర్, శ్రీ కొండాలక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ వర్సిటీలో హార్టికల్చర్ డిప్లొమా కోర్సులు, పీవీ నరసింహారావు వెటర్నరీ వర్సిటీలోని యానిమల్ హజ్బెండరీ కోర్సుల్లోను పాలిసెట్ ర్యాంక్‌ల ద్వారానే ప్రవేశాలు కల్పిస్తారు.
పాలిసెట్ నోటిఫికేషన్ ఈ నెల 9న విడుదల చేస్తారు. అదే రోజు నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు. పాలిసెట్ హాల్ టికెట్లను వెబ్ సైట్ నుండి ఒక వారం ముందు నుంచే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ప్రవేశపరీక్ష జూన్ 30న జరుగుతుంది.
ఈ సంవత్సరం పాలిసెట్ దరఖాస్తులు చాలా ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.దీనికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇతర వివరాల కోసం www.polycet.telangana.gov.in, polycetts.nic.in వెబ్‌సైట్‌లను సంప్రదించాలని కన్వీనర్ డాక్టర్ సీ శ్రీనాథ్ తెలిపారు. విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం 040 -23222192 హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చని పాలిసెట్ కన్వీనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
Post a Comment